నా యుట్యూబ్ ఛానల్ కై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా ఇ-బుక్కులకై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా రచన లగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)


నా సోషల్ మీడియా లింక్సు (క్లిక్/టచ్ చేయండి)


   

నా బ్లాగు నగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

    

నేటి నా బ్లాగు టపా :: టపా సంఖ్య : 1322

నన్నే కాదంటావా (కథ)

  


        కృష్ణారావుని హత్య చేశాడు ప్రభాకర్.


ప్రభాకర్ బెస్ట్ ఫ్రెండ్ కృష్ణారావు.

***

టివి వార్తల్లో కృష్ణారావు హత్య గురించి వస్తోంది.

హడలిపోయింది శ్రావణి.

తన తల్లిదండ్రులని పిలిచి ఆ వార్తని చూపింది.

"దారుణం" అన్నాడు శ్రావణి తండ్రి రఘుబాబు.

"పాపం" అంది శ్రావణి తల్లి శారదాంబ.

మరికొంత సేపు గడిచింది.

హంతకుడు ప్రభాకర్ అని చెప్పుతున్నారు.

"నీచుడు" అంది శారదాంబ.

"అమ్మో" అన్నాడు రఘుబాబు.

  శ్రావణి ఇంకా తేరుకోలేదు.

***

"కృష్ణారావు నాకు హేండిచ్చాడు. అందుకే చంపేశాను." చెప్పాడు ప్రభాకర్.

"సరిగ్గా చెప్పు" అడిగాడు పోలీసాఫీసర్.

"ఓ పనికి సహకరించమన్నాను. వాడు సరే అన్నాడు. కానీ వాడే ఆ నా పనిని విఫలం చేశాడు" చెప్పాడు ప్రభాకర్.

"అరె. ఏమిటి నువ్వు చెప్పుతున్నావు. అర్ధమయ్యేలా చెప్పు". గొంతు పెంచాడు పోలీసాఫసర్.

"నేను అనుకున్నట్టు కుదరలేదు సార్." చెప్పాడు ప్రభాకర్.

"అరె. చెప్పేది సరిగ్గా చెప్పు". అరిచాడు పోలీసాఫీసర్. 

***

"శ్రావణిని కృష్ణారావే కాపాడాడు. లేదంటే ఈ పాటికి దాని చావు వార్తల్లో వచ్చి ఉండేదు" అంది శారదాంబ భీతిగా.

"అవునవును. అతను హెచ్చరించి ఉండకపోతే అదే జరిగేది. మనకు మేలు చేశాడు. తను చనిపోయాడు. పాపం" అన్నాడు రఘుబాబు బాధగా.

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

***

"నేను ఒకర్ని చంపాలని ప్లాన్ వేసుకున్నాను. దానికి సహకరించమని కృష్ణారావుని కోరాను. చివరికి నేను చంపాలనుకునే ఆ వ్యక్తికి నా ప్లాన్ ని చెప్పేశాడు. నాకు మోసం చేశాడు" చెప్పాడు ప్రభాకర్.

"ఎవరా ఒకరు" అడిగాడు పోలీసాఫీసర్.

ప్రభాకర్ చెప్పలేదు.

తిరిగి అడిగాడు పోలీసాఫీసర్.

"చెప్పను" చెప్పాడు ప్రభాకర్.

"ఏం" - పోలీసాఫీసర్ కంగారయ్యాడు.

"తనని బయట పెట్టను. అది నాకు ఇష్టం లేదు"  ప్రభాకర్ చెప్పాడు.

***

"మనని కృష్ణారావు జాగరిత పర్చడం ప్రభాకర్ కి తెలిసిపోయి ఉంటుంది" అంది శారదాంబ.

"అంతే. లేకపోతే కృష్ణారావు అతడి ఫ్రెండే కదా. ఎందుకు చంపుతాడు" అన్నాడు రఘుబాబు.

"కృష్ణారావు మనని కలిసినట్టు కానీ ప్రభాకర్ ప్లాన్ ని మనకి చెప్పినట్టు కాని మనం పొక్కనీయలేదు కదా. మరెలా" - శారదాంబ విస్మయమయ్యింది. 

"మరే. కృష్ణారావు మనని కలిసిన లగాయితు మనం అసలు బయటకే పోలేదు కదా. మరేమయ్యి ఉంటుంది" - రఘుబాబు సంశయమయ్యాడు.

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

***

"బయట పెట్టాలి. హత్య వెనుక ఉన్న ప్రతి కారణం తెలియాలి" చెప్పాడు పోలీసాఫీసర్.

ప్రభాకర్ మాట్లాడలేదు.

"చెప్పు. చెప్పి తీరాలి" అన్నాడు పోలీసాఫీసర్.

"తనని బయట పెట్టను. తన ఉనికి భంగం కాకూడదు." చెప్పాడు ప్రభాకర్.

"అబ్బో. ఇంత చేసి ఇప్పుడు నువ్వు గుణవంతుడులా మాట్లాడకు." - పోలీసాఫీసర్ విసుగయ్యాడు.

ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు.

***

"తను మనల్ని హెచ్చిరించినట్టు ప్రభాకర్ కి కృష్ణారావే చెప్పేసి ఉంటాడా." శారదాంబ అంది.

"ఏమో. కాకపోవచ్చు. ప్రభాకర్ మూర్ఖత్వం తెలిసిన కృష్ణారావు మననే బయట పెట్ట వద్దని హెచ్చిరించినవాడు తను ఎలా ఆ విషయాన్ని బయట పెడతాడు" రఘుబాబు అన్నాడు. 

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

***

"ఎవరు ఆ ఒకరు" అడిగాడు పోలీసాఫీసర్. ఈ మారు మరింత గట్టిగానే.

"నా లవ్వర్ సార్" చెప్పాడు ప్రభాకర్.

"ఓ. ఆ ఒకరు లేడీయా. లవ్ మేటరా. ఎవరు ఆమె"  పోలీసాఫీసర్ అడిగాడు.

"సార్. ఆమె గురించి ఇప్పుడు ఎందుకు. నేను చంపింది కృష్ణారావుని. అది ఒప్పుకుంటున్నాను కదా" అన్నాడు ప్రభాకర్.

"అదే అతడిని ఎందుకు చంపావో తేలాలి మరి"  పోలీసాఫీసర్ అన్నాడు.

"అదీ చెప్పాను కదా సార్. వాడు నా ప్లాన్ ని పాడు చేశాడు. గట్టిగా నిలతీశాను. తన్నాను. వాడే నా ప్లాన్ కి అడ్డైనట్టు ఒప్పుకున్నాడు. అందుకే వాడిని చంపేను"  ప్రభాకర్ చెప్పాడు.

"ఆ నీ ప్లాన్ ఏమిటి" పోలీసాఫీసర్ ప్రశ్నించాడు.

***

"ప్రభాకర్ నాన్న గట్టివాడు. ఎలాగైనా ప్రభాకర్ బయటకి వచ్చేస్తాడు. శ్రావణికి ప్రమాదం మరింత పెరిగింది" - శారదాంబ గింజుకుంటుంది.

"అవునవును. నిజమే" అన్నాడు రఘుబాబు.

"మనం ఇప్పుడే పోలీసులని కలిసి ఈ విషయం చెప్పేస్తే మంచిదేమోనండి. మరింత కఠినంగా ఆ ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవచ్చు వారు. అలా మన శ్రావణికి సేఫ్టీ ఏర్పడవచ్చు" అంది శారదాంబ.

"నిజమే. తొలుత పోలీసుల వారి వరకు ఎందుకు అనుకున్నాం. పరువు కోసం ఆలోచించాం. ప్రభాకర్ లో ఇంత బరితెగింపు ఉందని తెలిశాక మనం బయట పడిపోవాలి. మనం పోలీసు వారిని కలవాలి" చెప్పాడు రఘుబాబు.

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

***

"మళ్లీ మళ్లీ అడిగించుకోకు. చెప్పు. ఏం ప్లాన్ వేశావు" అడిగాడు పోలీసాఫీసర్.

"ప్లాపయ్యిన ఆ ప్లాన్ మరెందుకండీ. ఏదయ్యినా నేను హంతుకుడ్నయ్యాగా" అన్నాడు ప్రభాకర్.

"కబుర్లాపి అసలది చెప్పు."  - పోలీసాఫీసర్ విసుక్కున్నాడు.

ప్రభాకర్ ఏదో చెప్పబోతుండగా అప్పుడే అక్కడికి శ్రావణితో వచ్చారు శారదాంబ, రఘుబాబులు.

వారిని చూస్తూనే, "ఏయ్.  ఎందుకు వచ్చారు" అనడిగాడు ప్రభాకర్.

"ఎవరు మీరు" అడిగాడు పోలీసాఫీసర్ శ్రావణి వాళ్లని.

శ్రావణి తల్లిదండ్రులు ఏదో చెప్పబోతుండగా - "ఆమె శ్రావణి సార్" అన్నాడు ప్రభాకర్.

"ఓ. ఈమెనా నీ లవ్వరు" అడిగేశాడు పోలీసాఫీసర్.

"కాదు సార్." చెప్పాడు ప్రభాకర్.

"మరి." - పోలీసాఫీసర్ తికమకయ్యి - "నీ ప్లాన్ ప్రకారం చంపబోయేది ఈమెని కాదా." అన్నాడు.

"అయ్యో. లేదు సార్. ఈమెని కాదు. వీళ్లు నాకు తెలిసినవాళ్లు. అంతే." చెప్పాడు ప్రభాకర్.

"మరయ్యితే ఆమె ఎవరు" అడిగాడు పోలీసాఫీసర్.

"బయట పడనీయనన్నాను కదా సార్" చెప్పాడు ప్రభాకర్.

పోలీసాఫీసర్ శ్రావణి వాళ్ల వైపు తిరిగి, "ఇతను మీకు తెలుసా. మీరు ఎందుకు వచ్చారు" అని అడిగాడు.

వాళ్లు అయోమయంలో పడ్డారు ప్రభాకర్ వాటంకి.

"తెలిసినవాళ్లు  కదా సార్. నా కోసం వచ్చారు." అనని, "శ్రావణీ మీరు వెళ్లిపోండి. కృష్ణారావు నన్ను మోసం చేశాడు. అందుకే వాడిని హత్య చేసేశాను." చెప్పాడు ప్రభాకర్.

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

గడబిడయ్యారు శ్రావణి తల్లిదండ్రులు.

"మీరు వెళ్లిపోండి. మీరు ఇతనికి ఏ సహాయం చేయలేరు. కోరి లొంగిపోయాడు. తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆఁ." అన్నాడు పోలీసాఫీసర్.

శ్రావణి తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత ఏదో చెప్పబోయారు.

"మీరు వెళ్లండి. మా నాన్న వస్తారు. ఆయనే అన్నీ చూసుకోగలరు. మీకెందుకు శ్రమ. వెళ్లిపోండి" అన్నాడు ప్రభాకర్ గబగబా.

పోలీసాఫీసర్ శ్రావణి వాళ్లని పట్టించుకోలేదు.

శ్రావణి ఇంకా తేరుకోలేదు.

"మీరు వెళ్తారా లేదా" అరిచాడు ప్రభాకర్ శ్రావణి వాళ్ల వంక తీవ్రంగా చూస్తూ.

దాంతో శ్రావణి వాళ్లు అస్తవ్యస్తంగా బయటకి నడిచారు శ్రావణిని తీసుకొని.

అప్పుడే - "నేను వచ్చే వరకు బతికి ఉండు శ్రావణి. నన్నే కాదంటావా" అని మనసులో కసిగా అనుకుంటూనే ప్రభాకర్ బయటికి మాత్రం ముభావవయ్యాడు.

***

కానీ తర్వాత జరిగినవి వేరు. 

అవి -

కేసు కొనసాగుతున్న రోజుల్లోనే ఓ రోజున సడన్ గా గుండె పట్టేసి ప్రభాకర్ చనిపోయాడు.

ఆ వార్త టివిలో వచ్చింది.

శ్రావణి తేరుకుంది.

*

(ప్రచురణ : స్టోరీ మిర్రర్ - వెబ్ ప్లేస్ - 5.4.2021)

***

ఈ నా బ్లాగ్ పై మీ స్పందన ...

పేరు

ఇమెయిల్ *

సందేశం *

ధన్యవాదములు ... నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం