స్నేహాంజలి
నేను, బివిడి ప్రసాదరావు, తెలుగు రైటర్ ని, తెలుగు బ్లాగర్ ని, తెలుగు వ్లాగర్ ని.
నా పూర్తి పేరు - బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు.
నేను పుట్టింది (15.5.1956), పెరిగింది, చదివింది (సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్య) మరియు నేను చేపట్టిన వృత్తి (సాంకేతిక విద్యల శిక్షణ) నిర్వహించింది - పార్వతీపురం (ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా) లో.
నేను ప్రస్తుతం (6.12.2011 నుండి) ఉంటుంది - హైదరాబాద్ (తెలంగాణ) లో. ఇదే నా మొదటి నివాస స్థల మార్పిడి. ఇది అవసరంతో ముడిపడిన ఒక కొత్త అనుభూతి.
మా అమ్మకు ఉన్న సాహిత్య పఠనాభిలాష, నన్ను రచయితను చేసింది. అమ్మ తనకి కావలసిన సాహిత్య పుస్తకాలని కొని ఇచ్చే లేదా అద్దెకి తెచ్చి పెట్టే పనులని నాకు పురమాయించేది. ఆ తోవలో ఆ పుస్తకాల పేజీలని తిప్పడం, ముఖ్యంగా ఆ పుస్తకాల అట్టల మీది సంక్షిప్త సమాచారాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. వాటి ప్రేరణలు కూడా నాలో రచయితకి ఊతమయ్యాయి.
అలాగే, నేను రచయిత కావడానికి మరి కొన్ని కారణాలు -
అన్నింటా, అన్నింటికీ స్పందన సహజం. అది మాటతో లేక వ్రాతతో లేక చేతతో వ్యక్తమయ్యి పోవడమూ సహజమే. ఆ హేతువే నా వరకు నేను రచయిత కావడానికి కారణం ఐంది.
నాకు మొహమాటం జాస్తీ. అందుకే కలయికలు తగ్గి, నా మాట పరిమితమయ్యింది. కావున వ్రాతను విరివిగా చేపట్టాను.
జీవి అంటేనే చావు ఉన్నది. కనుక నాకూ చావు ఉంటుంది. అట్టి చావు తర్వాత కూడా నేను, నా ఉనికి, నా ప్రయోజనం నిలబడాలి, నిలుపుకోవాలి. అందుకు ప్రయత్నంగా కూడా నేను రచయిత నయ్యాను.
నేను చిట్టి పొట్టి తెలుగు వ్రాతలనే విరివిగా చదువుతుంటాను, అట్టి తెలుగు రచనలనే ఎక్కువగా చేపడుతుంటాను. ఐనా అవసరం మేరకు కొద్దిపాటి పెద్ద పెద్ద రచనలనీ అడపాదడపా చేపడుతుంటాను.
నా చాలా రచనలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చాయి, వస్తున్నాయి. వాటిలో చిన్న నవలలు, వివిధ ప్రక్రియల కథలు, కవితలు, హైకూలు, నానీలు, పద కూర్పులు (ఫజిల్స్) ల్లాంటి శీర్షికలు ఉన్నాయి, ఉంటున్నాయి.
నావంటూగా రూపొందిన నా శైలి రచనలు – నా కురచ కథలు, నా సూక్ష్మ కథలు, నా బుడుత కథలు, నా రవ్వలు, నా ఊసులు, నా అలలు. వీటి ఆకృతులు మాత్రం తప్పక నా సొంత ఒరవడి.
నా అభిరుచి మేరకు నా రీతిన సాగుతూన్న నా తెలుగు వ్రాతలు ఇప్పటికి (01.04.2025) (నా మొదటి రచన - పేద బ్రతుకులు - కథ - 31.1.1975 లో ప్రగతి వార పత్రికలో అచ్చు అయ్యింది) సంఖ్యాపరంగా 1009 వద్ద ఉన్నాయి. వీటన్నింటినీ వివిధ ప్రింట్ మీడియా (రమారమీ అన్ని తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రిక) ల ద్వారా, వివిధ ఎలక్ట్రానిక్ మీడియా (రమారమీ అన్ని తెలుగు సాహిత్య వెబ్ సైటులు మరియు తెలుగు సాహిత్య యాప్) ల ద్వారా పాఠకుల దరికి చేర్చాను, చేరుస్తున్నాను.
పాఠకులుకు అందుబాటుగా, కొన్ని నా తెలుగు వ్రాతలని నేరుగా పుస్తక రూపాలుగా, మరి కొన్నింటిని ఈ-బుక్కులుగా అందించాను, వివిధ సాహిత్య సైట్లులో వాటిని ఉంచాను.
నా కొన్ని తెలుగు వ్రాతలు (కథలు, కవితలు, ఇతర రచనలు) చాలా బహుమతులు పొంది, వివిధ వర్గాల వారి ప్రత్యేక మన్ననలు పొందాయి.
నా అభిరుచి మేరకు నేను ‘బివిడి ప్రసాదరావు బ్లాగ్’ అనే పేరున ఒక తెలుగు బ్లాగును నిర్వహిస్తున్నాను. దీని ద్వారా ఉపయుక్తమైన, అవసరమైన, ఆమోదయోగ్యమైన అంశాలతో కూడిన నా తెలుగు వ్రాతలని టపాలుగా అందిస్తున్నాను. అలాగే ఈ నా బ్లాగులో నా రచనలన్నీ పొందుపర్చబడుతుంటాయి. మరియు నా వివరాలు, వివరణలు నా కబురులు శీర్షికన అందుబాటులో ఉంచబడుతున్నాయి.
అలాగే నేను 'బివిడి ప్రసాదరావు వ్లాగ్' అనే పేరున యూట్యూబ్ లో ఒక తెలుగు వీడియో సెక్షన్ (ఛానల్) ని నిర్వహిస్తున్నాను. దీనిలో నా రచనలని ఆడియో, వీడియో రూపాల్లో పొందుపరుస్తున్నాను.
నా బ్లాగు నాచే రావడంతో ప్రింట్ మీడియా వైపు నా రచనలు తగ్గాయి. కానీ ఎలక్ట్రానిక్ మీడియా నుండి చాలా నా రచనలు పెరిగాయి.
ప్రతికూల విషయాల ప్రస్తావనలతో కొనసాగిస్తూ చివరాఖరుగా అవి తగవు అని తేల్చి చెప్పిన రచనలు చేయడం కంటే సానుకూల సంగతులు ముచ్చటగా ముడి పెడుతూ రాసే రచనలనే నేను చేపడుతుంటాను.
నిజానికి ఒక రచన తాత్పర్యం కనువిప్పు నేర్పడమే కదా. ఆ నేర్పడం ఏదో సరళంగా సాగించడం సబబు కాదా. ఈ తర్కంతోనే నా రచనా విధం నెట్టుకు సాగుతుంది.
నేను 'స్నేహ కళలు సమ్మేళనము' సంస్థ ద్వారా ఎన్నో సాహిత్య మరియు సాహిత్యేతర కార్యక్రమాలు నిర్వహించాను. ఇది నా సొంత సంస్థ. ఈ సంస్థ ద్వారా నేను తగు సమయాల్లో సామాజిక మరియు సాహిత్య సేవలు చేపడుతున్నాను. ఆయా వాటికి నా రచనల మూలంగా నాకు ముట్టే ప్రతి పైసాను వెచ్చిస్తున్నాను. అలాగే ఎన్నెన్నో ఇతర సంస్థల్లో సభ్యుడుగా / కార్యవర్గ సభ్యుడుగా వారి వారి కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
ఎత్తుగడ, కథనం, మలుపుల్లాంటి సొగసులు నా రచనలలో కాన రాక పోవచ్చు. పైగా వాటి గురించి నాకు తెలియదు, ఆ పట్టింపులు కూడా నాలో లేవు. 'ఒక రచనకు ఉండ వలసిన లక్షణాలు ఇవి' అన్నది, నా రచనలతో నేను చూపించ(లే)క పోవచ్చు. మాత్రం, నా వరకు నాకు, 'విషయం' చదువుటకు ఇమిడి పోయేలా ఉంటే చాలు, అన్నదే నా రచనకు ఆరంభం, గమనం మరియు ముగింపు. అంతే.
అలాగే నా రచనలలో పాత్రలు ... కించ పడవు, కించ పర్చవు. తమ స్థితులకు కారణాలు చూపుతూనే, సర్దుకు మెలుగు అన్నట్టు తీర్చి దిద్దబడతాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలు, మెలుకువుగా మెలుగుతాయి, సాఫీగా సాగుతాయి. నాయికలా ఉన్నా నాయకలా నిలుస్తుంటాయి.
ఆడే మాటకు, వ్రాసే వ్రాతకు స్వేచ్ఛ ఉంది, బాధ్యత కూడా ఉంది. ఇది ఎఱిగే నేను వ్రాస్తున్నాను.
తుది ఆఖరుగా -
'మన్నన కంటే, మనుగడ గొప్పది' అన్నది నా ప్రతి రచన లోను,
మరియు,
నేను పైన తెలిపిన తేదీలతో పాటు, 17.2.1979 (నా పెళ్లి రోజు), 2.12.2017 (నా అర్థాంగి ఝాన్సీ లక్ష్మీబాయి నన్ను భౌతికంగా మాత్రమే వీడిన రోజు) తేదీలు నా ప్రతి అడుగు లోను,
జొప్పిస్తూ, ఆ స్పృహ తోనే కదులుతూ, కదులాడుతూ ఉన్నాను.
బాధించే జ్ఞాపకాలు వద్దు, బతికించే జ్ఞాపకాలే ముద్దు అన్నదే నా ఉనికి, నా ఊపిరి.
మీ
(my email id : prao.bvd@gmail.com)
నా తెలుగు బ్లాగు
నా తెలుగు వ్లాగు